: నాన్నను తన దగ్గరకు తీసుకెళ్లేందుకు... నాన్నలా తయారైన యువకుడు!


విదేశాలకు వెళ్లిన పిల్లలు ఎన్నో కష్టనష్టాలకోర్చి నిలదొక్కుకుంటారు. అక్కడి కొంచెం బాగా స్థిరపడితే మాత్రం తమ తల్లిదండ్రులు తమ స్థితిగతులు చూసి సంతోషించాలని భావిస్తారు. అలా భావించిన ఓ కేరళీయుడు తన తల్లిదండ్రులను తనుండే బహ్రెయిన్ తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే, రావడానికి తల్లి ఒప్పుకున్నా తండ్రి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎట్టకేలకు తండ్రి ఎందుకు తన వద్దకు రానంటున్నాడన్న విషయం తెలిసుకుని ఆశ్చర్యపోయి... తన తండ్రికంటే ఏదీ ఎక్కువ కాదంటూ దిగివచ్చాడు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టుతో కూడిన ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అతను చెప్పిన వివరాల్లోకి వెళ్తే...."నా పేరు డేవిస్‌ దేవాసీ చిరమెల్‌. బహ్రెయిన్‌ లో ఉద్యోగం చేస్తున్నాను. నా వద్దకు రమ్మని నా తల్లిదండ్రులను ఎన్నో సార్లు అడిగాను. ఎప్పుడడిగినా వాళ్లు రాలేదు. వాళ్లు రాలేదన్న బాధతో అసలు వారెందుకు తన దగ్గరకు రావడానికి విముఖత చూపిస్తున్నారన్న కారణం కోసం అన్వేషించగా...ఈ మధ్యే వారి సమస్య తెలిసింది...అసలు కారణమేంటంటే...కేరళలోని ఓ చిన్న గ్రామంలో తన జీవితం మొత్తం గడిపిన మా నాన్న ఇంతవరకూ ఎన్నడూ చెప్పులు, ప్యాంటు వేసుకోలేదు. కేరళ సంప్రదాయం ప్రకారం పంచె మాత్రమే కట్టుకుంటారు. సూటూ బూటూ వేసుకున్న కొడుకు వద్దకు చెప్పులు, ప్యాంటు లేకుండా వెళ్తే ఎక్కడ చిన్నచూపు చూస్తారోనన్న భయంతోనే మా నాన్న ఇన్నాళ్లూ నా వద్దకు రాలేదు.

ఈ నిజం తెలిసిన నేను షాక్ తిన్నాను. వెంటనే ఇండియా వచ్చి, అమ్మ, నాన్నను ఒప్పించి బహ్రెయిన్‌ తీసుకెళ్తున్నాను. మా నాన్న పాదాల నుంచి చిందించిన ప్రతి రక్తపు బొట్టు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే మా నాన్న నాతో ఉన్నన్నాళ్లు నేను కూడా చెప్పులు, ప్యాంటు వేసుకోను. ఆయన లాగే పంచె కట్టుకుంటాను" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన తల్లిదండ్రులను బహ్రెయిన్ తీసుకెళ్తుండగా ఎయిర్ పోర్టులో కూర్చున్న ఫోటోను పోస్టు చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు డెవిస్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News