: భారతీయ విద్యార్థులకు డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇవ్వాలి!: సెనెటర్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయులు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఉక్కుపాదం మోపుతూ వివిధ నిర్ణయాలు తీసుకుంటున్న దశలో నార్త్ కొరోలినా సెనేటర్ థాం టిల్లిస్ భారతీయులను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. అమెరికా అగ్రస్థానంలో కొనసాగాలంటే భారత్ కు సంబంధించిన ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలని సూచించారు. ఇంకా కుదిరితే అమెరికాలో విద్యనభ్యసించే టెక్ ప్రతిభావంతులకు గ్రీన్ కార్డును కూడా పట్టాతో పాటు అందజేయాలని ఆయన సూచించారు.
నార్త్ కరొలినాలో ఇండియన్ అమెరికన్లు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ విభాగాలలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులకు డిగ్రీలతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వాలని సూచించారు. హైటెక్ విభాగాలు, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, సైన్స్ అండ్ రీసెర్చ్ విభాగాల్లో అమెరికాకు మానవవనరులు అవసరమని ఆయన చెప్పారు. అమెరికాను మరింత ఉన్నతంగా, అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భారత్ నుంచి వచ్చే ప్రతిభావంతులకు టెక్ డిగ్రీలతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలు యూఎస్ లో కలకలం రేపుతున్నాయి. కాగా, ఆయన వ్యాఖ్యల పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.