: ఇది కేటీఆర్ తెలివి తక్కువ తనానికి అద్దం పడుతోంది: కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ గురించి తెలంగాణ శాసనమండలిలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మండిపడ్డారు. యూపీలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన మోదీ... తెలంగాణ రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయరంటూ కేటీఆర్ ప్రశ్నించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ ఉన్న సంగతి నిజమేనని... అయితే, అది కేంద్ర ప్రభుత్వ నిధులతో కాదనే విషయాన్ని కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. రుణమాఫీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇంత మాత్రం అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడటం... ఆయన తెలివి తక్కువ తనానికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు.
గద్వేల్ కు వందల కోట్ల రూపాయల నిధులను ఇస్తున్నారని... ఎర్రవల్లిలో మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారని... మిగిలిన వేలాది గ్రామాల్లో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మీకు నిజంగా నిజాయతీ ఉంటే దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. దీనిపై చర్చకు కేటీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.