: గీతకార్మికుడి కుటుంబానికి సాంఘిక బహిష్కరణ.. ఎవరైనా మాట్లాడితే రూ.3వేల ఫైన్.. గ్రామ కమిటీ ఆదేశం!
పల్లెల్లో ఇంకా సాంఘిక బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. తమకు మాటమాత్రమైనా చెప్పకుండా సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో ఓ గీత కార్మికుడిపై సాంఘిక బహిష్కరణ విధించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం జీజీ నడ్కుడలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఎనిమిది నెలల క్రితం షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. దీంతో అసలు గ్రామంలో ఎన్ని గృహావసర, వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయో చెప్పాలంటూ గ్రామానికి చెందిన గీత కార్మికుడు రాజుగౌడ్ సమాచార హక్కు చట్టం కింద విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు.
విద్యుత్ అధికారులు ఈ విషయాన్ని గ్రామాభివృద్ధి కమిటీకి తెలిపారు. అయితే తమకు చెప్పకుండా దరఖాస్తు చేశాడన్న కోపంతో, రాజుగౌడ్‌పై గ్రామాభివృద్ధి కమిటీ మండిపడుతూ రూ.60 వేల జరిమానా విధించింది. ఫైన్ కట్టకుంటే గ్రామం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దరఖాస్తు వల్ల విద్యుత్ శాఖ నుంచి గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకపోతే జరిమానా డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని పెద్దలు తెలిపారు. దీంతో రాజుగౌడ్ రూ.60 వేలు చెల్లించాడు.
కాగా, ఇటీవల గ్రామానికి నూతన గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నికైంది. దీంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా కమిటీ సభ్యులను రాజు గౌడ్ కోరాడు. దీనికి వారు తిరస్కరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కమిటీ సభ్యులు ఐదు రోజుల క్రితం రాజు కుటుంబానికి సాంఘిక బహిష్కరణ శిక్ష విధించారు. అంతేకాదు, గ్రామస్తులు ఎవరైనా అతడి కుటుంబంతో మాట్లాడినా, మాట్లాడినట్టు తెలిసినా రూ.3 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.