: మేం క్లాసులు ఎగ్గొట్టి తిరిగేవాళ్లం.. మీరలా చేయొద్దు!: విద్యార్థులకు మంత్రి కేటీఆర్ పిలుపు
‘‘నేను ఈ కాలేజీ పూర్వ విద్యార్థినే. ఇదే గ్రౌండ్‌లో క్రికెట్ ఆడా. క్లాసులు ఎగ్గొట్టి బయట తిరిగా. అప్పటికి ఇప్పటికీ కాలేజీ ఏమీ మారలేదు. ఇక్కడికి వస్తుంటే విద్యార్థిగా గడిపిన ఆ రోజులు మళ్లీ గుర్తొస్తున్నాయి. మీరు మాత్రం నాలా క్లాసులు ఎగ్గొట్టొద్దు. కష్టపడి చదివి నిజాం కళాశాల కీర్తిని, తెలంగాణ వైభవాన్ని నలుదిశలా చాటిచెప్పాలి’’ అని ఐటీశాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదు, బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల 138వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. నిజాం కళాశాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. కళాశాలలో బాలికల హాస్టల్ ను నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.