: బొమ్మ స్కూటర్ పై వార్డుకు చేరుకున్న రోగి!: ఆరా తీసిన కేటీఆర్!


 హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ పేషెంట్ బొమ్మ స్కూటర్ పై డాక్టరు వార్డుకు వెళ్లిన సంఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించి, దీనిపై ఆరా తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. బేగంపేట్ కు చెందిన రాజు ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ సంభవించిన సమయంలో అతను గాయాల పాలయ్యాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, చెకప్ ల నిమిత్తం అతను ఆసుపత్రికి వస్తుండేవాడు. వచ్చిన ప్రతిసారీ వీల్ చైర్ అవసరం పడుతుండేది. అయితే, రూ.150 లంచం ఇవ్వనిదే వీల్ చైర్ సౌకర్యం కల్పించేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించేవారు కాదు.

దీంతో, విసిగిపోయిన రాజు, ఆసుపత్రికి వస్తూ ఓ బొమ్మ స్కూటర్ ను తన వెంట తెచ్చుకున్నాడు. ఆ బొమ్మ స్కూటర్ పై కూర్చుని సంబంధిత డాక్టరు ఉండే వార్డుకు వెళ్లాడు. అయితే, ఈ దృశ్యం మీడియా కంటపడటంతో రికార్డు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడానని, బాధితుడికి సంబంధించిన వివరాలు అడిగానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ సంఘటనపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టరు మంజుల మాట్లాడుతూ, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

  • Loading...

More Telugu News