: పాతబస్తీలో 17 మంది వడ్డీ వ్యాపారుల అరెస్టు
హైదరాబాదులోని పాతబస్తీలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. పాతబస్తీలో వడ్డీ వ్యాపారుల వివరాలు సేకరించిన సైబరాబాద్ పోలీసులు 17మంది వడ్డీ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని, పాతబస్తీలోని పేదలకు అధికవడ్డీలకు రుణాలు ఇస్తూ వేధింపులకు గురి చేయడంపై వారిని ప్రశ్నించారు. పాతబస్తీ వడ్డీ వ్యాపారుల్లో ఈ 17 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత విడుదల చేస్తామని, మళ్లీ ఫిర్యాదు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.