: హిందూ మతాన్ని కించపరిచాడంటూ కమల హాసన్ పై ఫిర్యాదు
ప్రముఖ నటుడు కమల హాసన్ పై తమిళనాడులో కేసు నమోదైంది. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన అభిప్రాయం చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘‘మహాకావ్యంగా భావించే ఆ మహా గ్రంథంలో ఓ మహిళ తీవ్ర అన్యాయానికి గురైంది. పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నారు. అయినా సరే.. ఓ మహిళను పావులా వాడుకున్న ఆ గ్రంథాన్నే భారత్ ఇంకా గౌరవిస్తూనే ఉంది. ఎందుకు?’’ అంటూ ఆయన మహాభారతంపై తన మనసులో భావాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై తమిళనాడులోని హిందూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ చాలా కాలంగా తమ మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు. పవిత్ర గ్రంథాలను విమర్శిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కమల హాసన్, ముస్లిం, క్రైస్తవులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా? అని తమిళ హిందూ సంస్థ మక్కల్ కచ్చి (హెచ్ఎంకే) కార్యదర్శి రమా రవికుమార్ ప్రశ్నించారు. కమల హాసన్ హిందూ వ్యతిరేకి అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను భంగపరిచాయని పేర్కొంటూ ఆయన చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.