: ఏపీకి నీళ్లు రాకుండా చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: గాలి ముద్దుకృష్ణమనాయుడు
ఏపీకి నీళ్లు రాకుండా చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించి ... దిగువనున్న ఏపీకి నీళ్లు రాకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించే హక్కు టీఆర్ఎస్ కు లేదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ నుంచి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఎంత వరకు సబబు? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్, సండ్రలపై విధించిన సస్పెన్షన్ ను తక్షణం ఎత్తి వేయాలని ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు.