: రక్షణ రంగంలో పాకిస్థాన్‌కు చైనా నుంచి సాయం: గ్లోబల్ టైమ్స్
పాకిస్థాన్‌కు చైనా అందిస్తోన్న సాయం గురించి కమ్యూనిస్ట్ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పలు వివరాలు తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడానికి రక్షణ రంగంలో పాకిస్థాన్‌కు ఆయుధాల మార్పిడి, బాలిస్టిక్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యుద్ధ ట్యాంకుల నిర్మాణంలో చైనా సహకారం అందిస్తోందని, ఇరు దేశాలు ఈ అంశంపై పరస్పరం సహకరించుకుంటున్నాయని పేర్కొంది. అంతేగాక, ఈ ఇరు దేశాలు తేలికపాటి, బహుళ వ్యవస్థ యుద్ధ విమానం ఎఫ్-సి క్సీలోలోంగ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాయని చెప్పింది.
ముఖ్యంగా చైనాలోని తూర్పు తుర్కెస్థాన్ ప్రాంతంలోని ఇస్లామిక్ ఉగ్రవాదుల తిరుగుబాటు, చైనా-పాక్‌లోని ఉగ్రవాదుల అణచివేతకు ఒప్పందం చేసుకున్నాయని పేర్కొంది. ఎకనమిక్ కారిడార్ రక్షణ కోసం చైనా అందించే సాయానికి పాక్ అంగీకరించిందని చెప్పింది. చైనా- పాక్ ఎకనమిక్ కారిడార్ కోసం పాక్ 15 వేల మంది సైనికులను నియమించిందని ఆ పత్రికలో పేర్కొన్నారు. దానితో పాటు నేవీ కూడా గ్వాదర్ పోర్టులో భద్రతను మరింత పటిష్ఠం చేసిందని తెలిపింది.