: రవిశాస్త్రి ట్వీట్ కు అదే రేంజ్ లో మోదీ స్పందన!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన భారీ విజయంపై బీజేపీని, ప్రధాని మోదీని, అమిత్ షాను అభినందిస్తూ కామెంటేటర్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. అయితే, ఆ ట్వీట్ లో క్రికెట్ కామెంటరీలో ఉపయోగించే పదాలను వాడాడు. ‘బీజేపీకి అభినందనలు. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం ‘ఓ ట్రేసర్ బులెట్ లా దూసుకు వెళ్లి యూపీలో మూడు వందలకు పైగా సీట్లు సాధించారు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఉపయోగించిన ‘ట్రేసర్ బులెట్’ అనే పదం క్రికెట్ కు సంబంధించింది. ఓ బ్యాట్స్ మెన్ బౌండరీ కొట్టినప్పుడు ఆ బంతి ట్రేసర్ బులెట్ లా దూసుకెళ్లిందంటూ అభివర్ణిస్తారు.
కాగా, రవిశాస్త్రి తన కామెంటరీలో తరచుగా ఉపయోగించే ‘క్రికెట్ ఈజ్ ద రియల్ విన్నర్’ అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకుని .. ‘యూపీలో నిజమైన విన్నర్ ప్రజాస్వామ్యమే’ అంటూ మోదీ బదులిచ్చారు. దీంతో, బీజేపీ అభిమానులు, క్రికెట్ అభిమానులు, నెటిజన్లు మోదీ స్పందన చూసి ‘భలే, టైమింగ్’ అంటూ ప్రశంసిస్తున్నారు.