: రంగు నీళ్లనుకుని బావపై టర్పన్ టైన్ ఆయిల్ చల్లిన మరదలు.. యువకుడి మృతి
రంగు నీళ్లనుకుని బావపై మరదలు టర్పన్ టైన్ ఆయిల్ చల్లడంతో పక్కనే ఉన్న పొయ్యిలో మంటలు చెలరేగి అంటుకోవడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీసులు పలు వివరాలు తెలిపారు. మృతి చెందిన యువకుడు నాగర్‌కర్నూల్ జిల్లా, లింగాల మండలం దేవుని తండాకు చెందిన చందర్ నాయక్(24) అని చెప్పారు. అతడు సింగరేణి కాలనీ గుడిసెల్లో సొదరుడి ఇంట్లో ఉంటూ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడని అన్నారు.
అయితే, హోలి పండుగ నేపథ్యంలో తన మరదలు అయిన 15 ఏళ్ల బాలికపై రంగు నీళ్లు చల్లాడని చెప్పారు. అయితే, ఆ బాలిక కూడా ఓ సీసాలో ఉన్న టర్పన్ టైన్ ఆయిల్ ను రంగు నీళ్లు అనుకుని అతడిపై చల్లిందని అన్నారు. పక్కనే మండుతున్న పొయ్యి ఉండడంతో దానిపై అది పడి మంటలు చెలరేగి ఆ యువకుడిపై పడ్డాయని చెప్పారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.