: రాహుల్!...ఆ పన్నెండు మందినీ బయటకు పంపు!: కిశోర్ చంద్రదేవ్ సూచన
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. అధిష్ఠానంపై విమర్శలు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రధానంగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చెలరేగిపోతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పలు సూచనలు చేస్తున్నారు. నిన్న మాజీ ఎంపీ ప్రియాదత్ పలు సూచనలు చేయగా, నేడు కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ నేరుగా పార్టీలోని తప్పులను ఎత్తిచూపారు. రాహుల్ గాంధీ తన చుట్టూ చేరిన డజను మంది కోటరీ నుంచి బయటపడాలని సూచించారు. పార్టీని బతికించుకోవాలంటే ఆయన తక్షణం ఆ కోటరీ నుంచి బయటకు రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ఆ పన్నెండు మందికి జవాబుదారీతనం లేదని ఆయన స్పష్టం చేశారు. వారిలో చాలా మంది పార్టీని ఫణంగా పెట్టి స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి వారే ముఖ్యపదవుల్లో కొనసాగుతున్నారని ఆయన మండిపడ్డారు. వారు ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రానికి, ఆ తరువాత ఇంకో రాష్ట్రానికి ఇన్ ఛార్జీలుగా వెళ్తున్నారని ఆయన ఎత్తిచూపారు. వారే కుర్చీలాట ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలను తాను పార్టీ సమావేశాల్లోనే చెప్పానని, ఇవి రాహుల్ గాంధీకి కూడా తెలుసని ఆయన చెప్పారు. ఆయనకు తెలిసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న కాదని, బిలియన్ డాలర్ల ప్రశ్న అని ఆయన చమత్కరించారు.