: 'సాయ్' పాలక మండలి సభ్యురాలిగా గుత్తా జ్వాల.. ఆనందంలో మునిగి తేలుతున్న బ్యాడ్మింటన్ స్టార్!
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాలకు జాతీయ స్థాయిలో పదవి లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పాలక మండలి సభ్యురాలిగా జ్వాలను నియమించారు. మన దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు జ్వాల చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించిందని... అందుకే ఆమెను పాలక మండలి సభ్యురాలిగా నియమించిందని సాయ్ కార్యదర్శి ఎస్ఎస్ ఛాబ్రా తెలిపారు. ఈ నిర్ణయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని... రెండు రోజుల క్రితం సాయ్ అధికారులు ఈ విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పారని గుత్తా జ్వాల తెలిపింది.
అయితే, సాయ్ లో తన భాధ్యతలు, విధులు ఏంటో ఇంకా తెలియదని జ్వాల చెప్పింది. ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో మొదటి సమావేశం ఉందని తెలిపింది. మన దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పింది. 2010 ఢిల్లీ ఏషియన్ గేమ్స్ లో జ్వాల సిల్వర్ మెడల్ గెలిచింది. 2011 వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఒలింపిక్స్ లో రెండు సార్లు భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. మొత్తం మీద 14 సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచింది.