: హెల్మెట్ లేని యువకులపై మహిళా ఎస్ఐ వీరంగం!


తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ హెల్మెట్ లేని ఇద్దరు యువకులపై మహిళా ఎస్ఐ వీరంగమాడిన సంఘటన కర్ణాటకలోని బెంగళూరు - మైసూరు హైవేలో చోటు చేసుకుంది. మద్దూరు సమీపంలోని సోమనహళ్లి గ్రామం వద్ద ఎస్ఐ సావి పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో నరసింహ, నిషాంత్ అనే ఇద్దరు యువకులు హెల్మెట్ లేకుండా మోటార్ బైక్ పై వచ్చారు. దీంతో, హెల్మెట్ లేకుండా ఉన్న వారిపై ఆమె విరుచుకుపడింది. అందులో ఒక యువకుడి కాలర్ పట్టుకుని అతని చెంపలు వాయించేసింది.

అనంతరం వాళ్లిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి.. ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నారంటూ వారిపై కేసు నమోదు చేసింది. కాగా, బాధిత యువకులు మాత్రం తాము జరిమానా చెల్లించినప్పటికీ మహిళా ఎస్ఐ తమను దూషిస్తూ, చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, వాహనాల తనిఖీ సమయంలో ఆ యువకులపై ఆమె ప్రవర్తించిన తీరును అక్కడ ఉన్న వారు తమ సెల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో, మహిళా ఎస్ఐ పై పలు విమర్శలు తలెత్తాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ, ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని, ఎస్ఐ సావి తప్పు చేసినట్టు తేలితే ఆమెపై చర్యలు తప్పవని అన్నారు.

  • Loading...

More Telugu News