: ఇక్కడ రౌడీయిజం జరగడానికి వీల్లేదు.. గుర్తుపెట్టుకోండి!: అసెంబ్లీలో చంద్రబాబు హెచ్చరిక
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వాళ్లు రౌడీయిజం కావాలని అనుకుంటున్నారని, అయితే ఇక్కడ రౌడీయిజం జరగడానికి వీలులేదని, ఈ విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. తాను సభలో ప్రవేశపెట్టిన ‘కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాల తీర్మానం’ను ఆమోదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి హోదాతో సమానమైన సాయాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు.
ఈ రోజు తాము గర్వంగా చెబుతున్నామని, పోలవరం ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని సీఎం అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది 2,533 కోట్ల రూపాయలు మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వం ఖర్చుపెట్టింది 2,924 కోట్ల రూపాయలని అన్నారు. అయితే, రెండున్నరేళ్లలో తాము ఖర్చుపెట్టింది. రూ. 3500 కోట్లని సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఖర్చుపెట్టారని చెప్పిన జగన్ వ్యాఖ్యలని ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబు మాట్లాడిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలుపుతున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తెలిపారు. అనంతరం అసెంబ్లీనీ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.