: అప్పులు చేయడమే గొప్ప విషయం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు!: కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి విమర్శలు
కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు వంద ఏళ్ల జైలు శిక్ష, వెయ్యి కొరడా దెబ్బలు పడతాయని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని, ఆధారాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రానికి అప్పులు, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరుగుతున్నాయని, రెండేళ్లలో అత్యంత ధనికులుగా ఎలా మారారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు చేయడమే గొప్ప విషయం అన్నట్లుగా కేసీఆర్, కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని, అరవై వేల కోట్లు .. ఆరు లక్షల కోట్లు అంటూ కేసీఆర్ తలతిక్క వాదనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.