: 100 మంది చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు ఎక్కడుందో గుర్తించండి... బాంబే హైకోర్టు ఆదేశాలు


ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల మోడల్ తోపాటు... 100 మంది చేతిలో అత్యాచారానికి గురైన నేపాలీ అమ్మాయి (16) ఎక్కడుందో వెతికి పట్టుకోవాలని పూణె పోలీసులను బాంబే హైకోర్టు ఈ రోజు ఆదేశించింది. నేపాలీ అమ్మాయి తనపై వంద మందికి పైగా అత్యాచారం చేశారని, వీరిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ‘‘ఈ ఆరోపణలు తీవ్రమైనవి, బాధితులు ఎక్కడున్నారన్న విషయమై మేము ఆందోళనతో ఉన్నాం. వారిని గుర్తించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించండి’’ అని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ పోలీసులను కోరింది.

ఢిల్లీకి చెందిన న్యాయవాది అనుజకపూర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు బాధితురాళ్లు ఆరు నెలలుగా ఆచూకీ లేకుండా పోయారని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ లో కోర్టును అభ్యర్థించారు. వారిని నిందితులు హతమార్చి ఉంటారన్న సందేహాలను పిటిషనర్ వ్యక్తం చేశారు. తదుపరి విచారణ తేదీ (మార్చి 31) నాటికి డీసీపీ , ఆపై స్థాయి హోదా గల అధికారిని కోర్టు ముందు హాజరయ్యేలా నియమించాలని పోలీసు కమిషనర్ ను కోర్టు ఆదేశించింది.

ఢిల్లీకి చెందిన ఓ మోడల్ పూణెలో అత్యాచారానికి గురి కాగా, కాలిన గాయాలతో ఢిల్లీ ఆస్పత్రిలో గతేడాది మార్చిలో చేరడంతో ఈ విషయం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో పరిచయమైన రోహిత్ భండారీ అనే వ్యక్తి తనకు నటించే అవకాశం ఇప్పిస్తానని పుణెకు పిలిపించుకున్నాడని, అతడితో సన్నిహితంగా ఉండేందుకు తిరస్కరించడంతో సిగరెట్ ను కాల్చి వాతలు పెట్టినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత తనపై సామూహిక అత్యాచారం జరిగిందని కూడా వెల్లడించింది.

 అదే ఫ్లాట్ లో నేపాల్ కు చెందిన అమ్మాయి (16) ఆమెకు పరిచయం అయింది. బ్యూటీ పార్లర్ లో ఉద్యోగమిస్తానని 2014లో తనను పిలిపించారని, రెండేళ్లుగా తనను నిర్బంధించి పలు పట్టణాలకు తిప్పుతున్నారని, వంద మందికిపైగా తనపై అత్యాచారం చేశారని ఆమె చెప్పడంతో వీరిద్దరూ కలసి ఢిల్లీకి పారిపోయి వచ్చారు. గతేడాది మార్చి 23న ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసు అనంతరం పూణెకు బదిలీ అయింది. ఈ కేసులో ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బాధితురాళ్లు ఫిర్యాదు చేసేందుకు వారికి సహకరించిన న్యాయవాది అనుజ కపూర్ గత ఆరు నెలలుగా వారు తనకు అందుబాటులో లేకుండా పోయారని కోర్టుకు వివరించారు.

  • Loading...

More Telugu News