: రాహుల్ ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాషే!!: ఎమ్మెల్సీ కర్నె


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ మటాష్ అవుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో, ఎస్పీ తుడిచి పెట్టుకుపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాహుల్ ను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రభాకర్ పై విధంగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అని, తెలంగాణ మంత్రి కేటీఆర్ ది గోల్డెన్ లెగ్ అని కర్నె ప్రభాకర్ అభివర్ణించారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. తెలంగాణకు మూడు లక్షల ఉద్యోగాలు తీసుకు రావాలని కేటీఆర్ కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై ఉత్తమ్ వ్యాఖ్యలు చేస్తారా? అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవి కోసం ఆంధ్రా పాలకుల వద్ద ఊడిగం చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. సైనికుడిగా పని చేశానని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రాన్ని నష్టపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News