: అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా?.. ఓ విశ్లేషణ!
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం) ను ట్యాంపరింగ్ చేయడం వల్లే యూపీలో బీజేపీ విజయం సాధించిందని బీఎస్పీ అధినేత మాయావతి ఇటీవల ఆరోపించారు. ఆ వెంటనే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు త్వరలో జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలను వినియోగించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పని తీరుపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయనే విషయాన్ని కేజ్రీవాల్ కూడా వ్యక్తం చేశారు.
అలాగే, గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా ఈ విషయమై పలువురు నేతలు ఇలాంటి ఆరోపణలే చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చా? అసలు అది సాధ్యమవుతుందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. బ్లూ టూత్ కనెక్షన్ ఆధారిత చిన్న చిప్ ఒకటి ఈవీఎంలలో ఉంటుంది. ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉండే ఈవీఎంలలోని ఈ చిప్ లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రించి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించవచ్చని అనుమానాలు ఉన్నాయి. అయితే, ఈ విధంగా చేయడం అసాధ్యం.
ఎందుకంటే, లక్షలాది ఈవీఎంలలో ఈ తరహా చిప్ లు ఉంటాయి. పలు రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోని ఎన్నికల కేంద్రాల్లోని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలంటే వందలాది మంది వ్యక్తులు సహా అధికారులు పలు దశలలో సహకరించాల్సి ఉంటుంది. కనుక, ట్యాంపరింగ్ చేయడం కష్టసాధ్యం. అయితే, బ్యాంకు అకౌంట్లనే హ్యాక్ చేస్తున్న తరుణంలో ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఈవీఎం ను హ్యాక్ చేయాలంటే.. ఆ ఈవీఎం కచ్చితంగా ఇంటర్ నెట్ కు అనుసంధానమై ఉండాలి. కానీ, ఈవీఎంలను ఇంటర్ నెట్ కు కనెక్ట్ చేయరు కనుక, ఈ ప్రయత్నాలు జరిగేందుకు అవకాశం లేదని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.