: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ఊబిలో పడేస్తున్నారు: జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న లెక్కలు యావత్ ఆంధ్రప్రదేశ్ ఆశ్చర్యపోయేలా ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఏపీ బడ్జెట్ 1,56 వేల కోట్లని అంటున్నారని, 2013, 14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంత పెద్దమొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదని అన్నారు. అంతగా ఆదాయం లేని రాష్ట్రంలో ఇంతగా బడ్జెట్ ఏంటని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేస్తున్నారని చెప్పారు. 2016 డిసెంబరు 31లోపు స్తోమతను మించి అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. మూడు శాతం అప్పులు తెచ్చుకోవాల్సిన చోట 5 శాతం అప్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 17 వేల కోట్లు రూపాయల అప్పులను గురించి ప్రభుత్వం చెప్పడం లేదని ఆయన ఆరోపించారు.