: 2050 వరకు ఎందుకు?.. చంద్రబాబు లెక్కల ప్రకారం ఏపీ ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్!: జగన్ చురకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న లెక్కలు తమను ఎంతో ఆశ్చర్యపరుస్తున్నాయని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... 2029లో రాష్ట్రం ఇంకాస్త ముందుకు వెళుతుందని, 2050 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ముందుంటుందని చంద్రబాబు అంటున్నారని ఆయన తెలిపారు. తాను చంద్రబాబు నాయుడిని ఒకటే ఒకటి అడుగుతున్నానని, ఐఎంఎఫ్ ఇటీవల గణాంకాలు విడుదల చేస్తే అందులో ప్రపంచ వ్యాప్త జీడీపీ రేట్ 3.1 శాతంగా ఉంటే ఇండియాలో 7.1గా ఉందని తెలిపిందని, అయితే, 2016-17లో రాష్ట్ర జీడీపీ మాత్రం 11.61 శాతం నమోదు చేసిందని చంద్రబాబు చెప్పారని అన్నారు. ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే నెంబర్ 1 గా ఉంది కదా? అని అన్నారు. మరి 2050 అని అనడం ఎందుకని, ఇప్పుడే నెంబర్ వన్‌గా ఉన్నట్లు లెక్క కదా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్నారని ఆయన అన్నారు.