: రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె!
తమ వేతన పెంపు అంశంలో కేంద్ర సర్కారుపై ఆగ్రహంతో ఉన్న వివిధ శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రేపు ఒకరోజు సమ్మెకు దిగనున్నారు. ముందుగా ఈ సమ్మెను గతనెల 16న చేయాలని వారు భావించారు. అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వారి సమ్మె వాయిదా పడింది. ఈ సమ్మెలో ప్రధానంగా పోస్టల్, ఆదాయ పన్ను శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర భూగర్భజల బోర్డు శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొననున్నారు.
7వ వేతన సంఘం చేసిన సిఫారసులో తమకు తక్కువ వేతనాలు కల్పించారని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్లను నెరవేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో గ్రామీణ తపాలా ఉద్యోగులు, క్యాజువల్, కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగులు కూడా పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం 33 లక్షల మంది ఉద్యోగులు, 34 లక్షల మంది పెన్షనర్లకు అన్యాయం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.