: రాజకీయ అవినీతిని బొంద పెట్టేశాం: శాసన మండలిలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతిని బొంద పెట్టేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన తెలంగాణ శాసనమండలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోలా ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు పనులు జరగడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కుంభకోణాలు గానీ, లంభకోణాలు గానీ లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో జరుగుతున్న ప్రతి పనిని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ అంటే కమీషన్ కాకతీయ అని.. మిషన్ భగీరథ అంటే కమీషన్ భగీరథ అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వంలా ఉండాలని అందరూ మెచ్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, వసతులు అందిస్తున్నామని, చిన్నారులు బ్రహ్మాండంగా ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే వారి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని గురుకుల పాఠశాలలను పెంచబోతున్నామని చెప్పారు.