: పాత నోట్ల మార్పిడి దందా.. సినీ డైరెక్టర్ రామకృష్ణ కోసం గాలిస్తున్న పోలీసులు!
పాత నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సినీ డైరెక్టర్ నల్లూరి రామకృష్ణ అలియాస్ కిట్టు కోసం హైదరాబాదు, బంజారా హిల్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిట్టు కారును పోలీసులు సీజ్ చేశారు. ఆ కారుపై ‘ప్రెస్’ అనే స్టిక్కర్ అంటించి ఉందని చెప్పారు. గత ఆదివారం రాత్రి కమలాపురి కాలనీలోని రామకృష్ణ ఆఫీసులో పాత నోట్ల మార్పిడి చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ సంఘటనలో రామకృష్ణ తప్పించుకోగా, అతని ఆఫీసు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై అతని సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను తనిఖీ చేస్తున్నామని, సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. రామకృష్ణ సెల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉందని, అతని నివాసం వద్ద పోలీసులను ఏర్పాటు చేశామని బంజారా హిల్స్ పోలీసులు పేర్కొన్నారు. కాగా, ‘కేటుగాడు’ సినిమాకు రామకృష్ణ దర్శకత్వం వహించారు.