: నీటికి రుచి జోడించారు... మూడు కోట్ల పెట్టుబడి తన్నుకుపోయారు... పదో తరగతి విద్యార్థుల ప్రతిభ!


రోజులో కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగుతాం. ప్రాణాధారమైన జలానికి మంచి రుచి జోడిస్తే ఓ లీటర్ ఎక్కువే తాగాలనిపిస్తుంది. పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు వచ్చిన ఆలోచనే ఇది. ఆ ఆలోచననే వ్యాపారంగా మలిచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కుర్రకారు ప్రతిభను చూసి రూ.3 కోట్ల పెట్టుబడి అందించేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది.

చైతన్య గొలెచా, మ్రిగంక్ గుజ్జర్, ఉత్సవ్ జైన్.. ఈ ముగ్గురూ రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన వారు. నీర్జా మోడీ స్కూల్లో పదోతరగతి చదివే ఈ ముగ్గురూ ఇన్ఫ్యూజన్ బెవరేజెస్ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ పెట్టేశారు. గతేడాది ఏప్రిల్ లో స్కూల్లో జరిగిన ఓ వేడుక వీరి లైఫ్ ను మార్చేసింది. 150 బాటిళ్ల ఫ్లావర్డ్ నీటిని సరఫరా చేసే ఆర్డర్ వారికి లభించింది. అంతే, ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఈ ఏడాది జనవరికి వీరు 8,000 బాటిళ్లను విక్రయించారు.

‘‘ఎటువంటి ప్రిజర్వేటివ్ లను కలపకుండా ఫ్లావర్డ్ నీటిని తయారు చేయాలన్నది మా ఆలోచన. చక్కెర, సోడా లేకుండా ఆరోగ్యకరమైన పానీయాన్ని తయారు చేసేది ఎలా అంటూ గూగుల్ లో తెగ పరిశోధన చేసేశాం. కానీ, మా ఆలోచన కార్యరూపం దాల్చేందుకు ఉన్న అడ్డంకులు తెలిసివచ్చాయి. మైనర్లుగా కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు పొందడం కష్టమని తేలడంతో మా తల్లిదండ్రులు మా తరఫున ఆ పని చేసి పెట్టారు’’ అని గుజ్జర్ వివరించాడు.

తమ ఆలోచనను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ముగ్గురూ ఐఐటీ కాన్పూర్, ఐఐఎం ఇండోర్ లలో జరిగిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పోటీల్లో పాల్గొన్నారు. అందరి నుంచి అభినందనలు అందుకున్నారు. మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీరి ఆలోచనకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. పేటెంట్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా సహకరించింది. రూ.3 కోట్ల పెట్టుబడి అందించేందుకు ఇటీవల ఇండోర్ లో జరిగిన సమావేశంలో గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది.

  • Loading...

More Telugu News