: ఫేస్బుక్ పోస్టులపై నిఘాకు ఇక చెక్!
ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ని ఎంతగా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, అదే సామాజిక మాధ్యమం ద్వారా పలు సంస్థలు పలు అంశాలపై నిఘా పెడుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి ఫేస్బుక్ కదిలింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు విక్రయిస్తున్నాయని తెలుసుకున్న ఫేస్బుక్, అందుకు వీలులేకుండా నిషేధాన్ని విధించింది. ఆయా సంస్థలు ముఖ్యంగా పలు దేశాల్లో వర్ణవివక్షతో కూడా ఇలా కొంతమందిని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.
ఫేస్బుక్లో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే వారికి ఈ నిఘా అనేది ముప్పుగా మారుతోంది. ఇప్పుడు ఇలా ఫేస్బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోవడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఫేస్బుక్ ప్రతినిధులు తెలిపారు. ఫేస్బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు కొన్ని రకాల టూల్స్ ఉంటాయని, వీటి ద్వారానే ఎవరెవరు ఎలాంటి పోస్టింగులు చేస్తున్నారో పరిశీలించవచ్చని చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో నిఘా సంస్థలు వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇందుకోసం 2010 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 40 కోట్లు ఖర్చుచేశాయి. అయితే, ఫేస్బుక్ యూజర్లు పోస్ట్ చేస్తున్న సమాచారమే తమకు ముప్పుగా మారుతుందని ఎంతోమందికి తెలియదు. దీంతో ఫేస్బుక్ ఈ చర్యలను చేపట్టింది. ఫేస్బుక్లో ఉన్న సమాచారాన్ని నిఘా అవసరాల కోసం ఉపయోగించకుండా నిబంధనలు విధించినట్లు తెలిపింది.