: ఆ టెలిఫోన్ బూత్ వద్దకు వెళుతున్నారు.. చనిపోయిన తమ వారి ఆత్మలతో మాట్లాడుతున్నట్లు ఫీలవుతున్నారు!
జపాన్ లోని ఓట్సుచి నగరంలో ఓ టెలిఫోన్ బూత్ వార్తల్లో నిలుస్తోంది. అదో పర్యాటక కేంద్రంగానూ మారిపోతోంది. జపాన్ దేశాన్ని 2011లో సునామీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సునామీ ధాటికి ఓట్సుచి పట్టణంలో 16 వేల మందికి పైగా స్థానికులు మృతి చెందారు. తమ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులను కోల్పోయిన అక్కడి ప్రజలు తీవ్ర విషాదంలో ఉండేవారు. అయితే, ఇటారు ససాకి అనే వ్యక్తికి ఓ విచిత్ర ఆలోచన వచ్చింది. తన ఇంటి గార్డెన్‌లో చుట్టూ అద్దాలతో ఇటారు ససాకి ఓ టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేసి, సునామీలో కోల్పోయిన తన సోదరుడితో మాట్లాడుతున్నట్లు ఫోన్‌లో సంభాషించేవాడు.
తన సోదరుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలాగే చేసేవాడు. దీంతో సోదరుడి ఆత్మతో మాట్లాడుతున్నట్లు, తన బాధను పంచుకున్నట్లు అతడు భావించేవాడు. అతడి కథ ఆ పట్టణమంతా వ్యాపించి, ఆ బూత్‌కు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. తాము కూడా ఆ ఫోన్ ద్వారా చనిపోయిన తమ బంధువులు, మిత్రులతో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మొత్తం 10 వేలకు పైగా కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటుండడం విశేషం. చనిపోయిన తమవారికి తమ సంగతులు చెప్పుకుంటున్నట్లు భావిస్తూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారు.