: ఎంసీడీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించ వద్దంటున్న కేజ్రీవాల్!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి ఓటు బీజేపీకి పడేలా ఈవీఎంలను టాంపరింగ్ చేశారని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే బాట పట్టారు. వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ మద్దతు పలకడం విశేషం.