: పిచ్చి కూతలు ఆపండి...క్రికెట్ ను నాశనం చేయకండి!: ఇయాన్ ఛాపెల్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో చోటుచేసుకున్న వివాదంపై ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ చాపెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడైన ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ, టీమిండియా-ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్ అంటే సహజంగా స్లెడ్జింగ్ ఉంటుందని అన్నాడు. గతంలో ఈ స్లెడ్జింగ్ హద్దులు దాటకుండా, ఆటపై ఆసక్తి పెంచేదని అన్నాడు. ఇప్పుడు స్లెడ్జింగ్ పేరుతో పిచ్చి కూతలు చోటుచేసుకుంటున్నాయని ఛాపెల్ విమర్శించాడు.
కారుకూతలు ఆపకపోతే క్రికెట్ ప్రతిష్ఠ మసకబారుతుందని హెచ్చరించాడు. గతంలో ఆటగాళ్ల దూకుడుతో ఆటకు మంచి జరిగేదని గుర్తుచేశాడు. ఇప్పటి ఆటగాళ్ల వ్యవహార శైలిని ఫీల్డ్ అంపైర్లతో పాటు, కెమెరాల సాయంతో ప్రేక్షకులు కూడా చూడగలుగుతున్నారని అన్నాడు. ఆటగాళ్లు హద్దు మీరితే బోర్డులు చర్యలు తీసుకోవాలని సూచించాడు. బోర్డులు చర్యలు తీసుకోకపోతే వారి చేతకాని తనమవుతుందని ఛాపెల్ చెప్పాడు. మైదానంలో కోహ్లీ తన ఎమోషన్స్ ను చెక్ చేసుకోవాలని ఛాపెల్ సూచించాడు.