: వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీని నిలదీసిన ఎన్నారై యువతి... వీడియో వైరల్


జాతి విద్వేష వ్యాఖ్యలు, దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కానీ, వైట్ హౌస్ లో పని చేస్తున్న ఉద్యోగులను కానీ నిలదీయాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ వారిని నేరుగా ప్రశ్నించేందుకు ధైర్యం చేయరు. కానీ ఓ భారతీయ యువతి శ్రీ చౌహాన్ (33) చాలా ధైర్యం చేసి, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీని సూటిగా ప్రశ్నించి, నిలదీసింది. మీడియాను ప్రశ్నించేందుకు వైట్ హౌస్ సిద్ధంగా లేదు కనుక పౌరురాలిగా తాను ప్రశ్నిస్తున్నానంటూ శ్రీ చౌహాన్ పేర్కొంది. వాషింగ్టన్ లోని ఆపిల్ స్టోర్ లో షాపింగ్ చేసేందుకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వచ్చారు. ఆయన రాకను గమనించిన శ్రీ చౌహాన్ నేరుగా ఆయన వద్దకు వెళ్లింది. 'ఫాసిస్టు కోసం పని చేయడం ఎలా ఉంది?' అని ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న స్పైసర్ చిన్న నవ్వు నవ్వి మౌనంగా ఉన్నారు.

దీంతో మరోసారి మండిపడ్డ శ్రీ... 'అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి విద్వేషకుడు... దేశ ద్రోహానికి పాల్పడ్డాడు' అంటూ రెట్టించింది. దీనికి స్పందించిన స్పైసర్ 'అమెరికా గొప్ప దేశ'మని చెబుతూ... 'గొప్పదేశం కనుకే నువ్వు ఇక్కడున్నావు?' అంటూ సమాధానమిచ్చారు. దీనికి ఎదురు ప్రశ్నించిన శ్రీ... 'గొప్పదేశం ఎలా అవుతుంది? మీరు రష్యా సాయంతో అధికారంలోకి వచ్చారు... అలాంటి మీరు నేరస్తులు కారా?' అని తిరిగి నిలదీసింది. ఈ వీడియోను చిత్రీకరించిన శ్రీ చౌహాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. అమెరికాలో జీవిస్తున్న పౌరుల ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో పని చేస్తున్న శ్రీ చౌహాన్ అమెరికాలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News