: పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తన కార్యకలాపాలు ఎలా సాగిస్తున్నాడో తెలుసా?
కరుడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు కొత్త చీఫ్ ను నియమించడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అంతరాయం కలుగకుండా హఫీజ్ సయీద్ జాగ్రత్తపడ్డాడు. జమాత్ ఉద్ దవా పేరును తెహరీక్ ఆజాదీ జమ్మూకశ్మీర్ గా మార్చుకున్న ఈ సంస్థకు హఫీజ్ సయీద్ బావమరిది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని చీఫ్ గా నియమించాడు.
మక్కీని పట్టిస్తే 13 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని పాక్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా, మక్కీ జమాత్ ఉద్ దవాలో నెంబర్ 2 గా ఉండేవాడు. హఫీజ్ సయీద్ ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో మక్కీని రంగంలోకి దించాడు. దీంతో హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం అనంతరం లాహోర్ నుంచి మక్కీ ఆరు ర్యాలీలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో జమాత్ ఉద్ దవా కార్యకాలాపాలను హఫీజ్ సయీద్ ఇంటి నుంచే చక్కబెడుతున్నాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాటిని జేయూడీ ఖండించింది. సంస్థకు సంబంధించిన అన్ని విషయాలూ మక్కీయే చూసుకుంటున్నాడని అధికారికంగా ప్రకటించింది. మక్కీ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.