: దిల్ రాజు భార్య మృతి వార్త విని నమ్మలేకపోయాను: పవన్ కల్యాణ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత మృతిపై ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కాటమరాయుడు’ పాటల చిత్రీకరణ నిమిత్తం ప్రస్తుతం ఇటలీలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దిల్ రాజు భార్య అనిత మృతి వార్త నిజం కాకూడదని అనుకున్నానని, ఎందుకంటే, వారి దాంపత్యం అంత అన్యోన్యమైందని, ఆమె మృతి చెందడం దిల్ రాజు కుటుంబానికి తీరని లోటని అన్నారు. తనకు సినీ పరిశ్రమలో ఉన్న కొద్దిమంది ఆత్మీయుల్లో దిల్ రాజు తనకు ముఖ్యమైన వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఇంతటి కష్టం రావడం తన మనసును ఎంతో కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ రాజు నిర్మించే చాలా చిత్రాలకు ఆయన భార్య అనిత సమర్పకురాలిగా ఉండేవారని, ఆ విధంగా సినీ పరిశ్రమతో ఆమెకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని అన్నారు. దిల్ రాజు కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, అనిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.