: నాడు గోవాను వీడుతూ కంటతడి పెట్టిన పారికర్.. మళ్లీ సీఎంగా అక్కడికే!
గోవాకు నాలుగో సారి ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న పారికర్ కు గోవా అంటే ప్రాణం. ఇందుకు నిదర్శనం, 2014 నవంబర్ లో జరిగిన సంఘటనే. అప్పుడు, గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పారికర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నిమిత్తం ఆయన గోవా వీడాల్సి వచ్చింది. ఆ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పారికర్ మాట్లాడుతూ, ‘పన్నెండు, పదమూడేళ్ల క్రితం భార్యను కోల్పోయిన నేను, ఇప్పుడు సొంత రాష్ట్రాన్ని వీడి వెళ్లడం నాకు చాలా కష్టంగా ఉంది’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
అయితే, తాజాగా రక్షణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన, మళ్లీ, గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పారికర్ ఉంటేనే బీజేపీకి మద్దతు ఇస్తామని గోవాలో ఎంజీపీ, జీఎఫ్ పీలు స్పష్టం చేశాయి. అందుకు, పారికర్ అంగీకరించడంతో, బీజేపీకి ఆయా పార్టీలు మద్దతు లేఖలు ఇవ్వడం, గోవా సీఎం గా పారికర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ గవర్నర్ మృదుల సిన్హా ఆహ్వానించడం జరిగిపోయాయి.