: భూమా మరణంతో కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత కలత చెందా: వైవీ సుబ్బారెడ్డి


నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తనను ఎంతో కలచి వేసిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత కలత చెందానని ఆయన అన్నారు. భూమా పిల్లలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై సుబ్బారెడ్డి మండిపడ్డారు. మూడేళ్ల నుంచి సంభవిస్తున్న వరుస కరవులతో ప్రకాశం జిల్లా రైతాంగం కకావికలమైందని తెలిపారు. తమ పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకుండా రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు రైతుల కష్టాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనికి తోడు వలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏమాత్రం లేదని సుబ్బారెడ్డి విమర్శించారు. 2018 నాటికల్లా వలిగొండను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ... ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి 2018 నాటికి తాగు, సాగు నీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే వైసీపీ తరపున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News