: నేటి నుంచి నగదు విత్ డ్రాపై తొలగిన ఆంక్షలు... కానీ డబ్బెక్కడుంది?
కేంద్రం వెల్లడించిన నిర్ణయం ప్రకారం, నేటి నుంచి సేవింగ్స్ ఖాతాలు సహా అన్ని రకాల బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్ డ్రాపై ఆంక్షలన్నీ తొలగిపోయాయి. ఇకపై ఎంత డబ్బయినా బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, తీవ్రమైన నగదు కొరత కారణంగా ఏటీఎంలు అన్నీ మూతపడగా, బ్యాంకుల్లో సైతం డబ్బు నిండుకుంది. ఈ నేపథ్యంలో డబ్బు విత్ డ్రాకు అవకాశాలు ఉన్నా, ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించిన తరువాత, నగదు కొరత సమస్య నుంచి బయటపడేందుకు తొలుత రూ. 2 వేలు, ఆపై రూ. 4,500, వారానికి రూ. 24 వేలు... ఇలా విత్ డ్రా పరిమితులను సడలిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఏటీఎంల ముందు కనిపిస్తున్న 'నో క్యాష్' బోర్డులు వెక్కిరిస్తుండగా, రేపటి నుంచి బ్యాంకులపై డబ్బు కోసం ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.