: 'అప్పట్లో మీరూ అలాగే చేశారుగా?' అంటూ కిషన్‌రెడ్డి చురక.. 'ఆ సందర్భం వేరన్న' కేసీఆర్!
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాల తీరును ఎండగడుతున్న సమయంలో సీఎంకు, బీజేపీ నేత కిషన్‌రెడ్డికి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ మాట్లాడుతుంటే ఆ అరుపులు, పెడబొబ్బలు అవసరమా? రన్నింగ్ కామెంట్రీలు ఎందుకు? ఏం, ఓ గంటసేపు ఓపిక పట్టలేరా?’’ అంటూ ప్రతిపక్షాలను నిలదీశారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి లేచి.. 'గతంలో మీరూ (టీఆర్ఎస్) అదే పనిచేశారుగా?' అంటూ కౌంటరిచ్చారు. దీనికి రియాక్టయిన కేసీఆర్ మాట్లాడుతూ, అప్పటి సమస్య ప్రజానీకానిదని, ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సందర్భమని పేర్కొన్నారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా హీరోయిజాన్ని ప్రదర్శిస్తామనడం సరికాదని, అదేమీ గొప్ప పనికాదని అన్నారు. పిల్లి కూతలు, అరుపులు సంస్కారం కాదంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు.