: ట్రంప్ వచ్చిన తరువాత అమెరికాలో భారతీయులకు లేనిపోని సమస్యలు వస్తున్నాయి: చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటించారు. అక్కడ వెమ్ ఏరోసిటీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాలో భారతీయులపై దాడుల గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు లేనిపోని సమస్యలు వస్తున్నాయని అన్నారు. భారతీయులు ఎంతో ప్రతిభావంతులని, అమెరికాలోని ఎన్నో కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఓ పక్క అమెరికాలో ఉండే మనవాళ్ల కోసం పోరాడుతూనే, మరోపక్క మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని వ్యాఖ్యానించారు. అమెరికాలో భారతీయులు ఎంతో మంది ఉన్నారని అన్నారు. వారిపై దాడులు జరుగుతుండడం బాధాకరమని చెప్పారు.