: తండ్రిపై బీరు బాటిళ్లు, కత్తులతో దాడి చేసిన కొడుకులు!
కన్న తండ్రిపై కుమారులు బీరు బాటిళ్లు, కత్తులతో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దాడిని అడ్డుకోబోయిన తమ తాతపై కూడా ఆ ఇద్దరు యువకులు దాడి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే, ఎలుగేడు రవీందర్ అనే వ్యక్తి సింగరేణి కాలరీస్ గోదావరిఖని డివిజన్లో ఉద్యోగి. కొన్ని నెలల నుంచి రవీందర్ తన జీతం డబ్బుల్లో కొద్ది మొత్తం మాత్రమే ఇంట్లో ఇస్తున్నాడు. ఈ విషయంపై ఆయనతో ఇంట్లో వారు పలుసార్లు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రవీందర్ కొడుకులైన ఉదయ్, చాణక్యలు తమ తండ్రిని తిడుతూ ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నారు.
దీంతో రవీందర్ ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో ఉంటున్న తన తండ్రి మల్లేశం ఇంటి వద్దకు వెళ్లాడు. అయితే, తమ తండ్రి తమ తాత ఇంట్లో ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న సదరు కుమారులు అక్కడికి కూడా వెళ్లి తండ్రితో గొడవపడి చితక్కొట్టారు. దాడిని అడ్డుకోబోయిన వారి తాతకు కూడా తీవ్రంగా దెబ్బలు తగిలాయి. వారిపై ఆ యువకులు కత్తులు, బీరు బాటిళ్లతో దాడి చేయడంతో వారిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.