: బీజేపీ ఘన విజయంతో మతకల్లోలాల భయం... సంబరాలపై పోలీసుల నిషేధం
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తి ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టినా బీజేపీని ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో అత్యంత సున్నిత ప్రాంతమైన ముజఫర్ నగర్ లో ఓట్ల లెక్కింపు అనంతరం... విజయం సాధించిన అభ్యర్థులు ఎలాంటి ఊరేగింపులు నిర్వహించరాదంటూ జిల్లా పోలీసు అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మతకల్లోలాలు చెలరేగే అవకాశం ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నారు. ఎవరైనా తమ ఆదేశాలను మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.