: ఉగ్రవాదులతో కలిసిన వాయుసేన మాజీ అధికారి... సైఫుల్లా వెనుక మాస్టర్ మైండ్... అరెస్ట్ చేసిన ఏటీఎస్
ఉగ్రవాదులతో చేతులు కలిపి, దేశంలో విధ్వంసాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడన్న ఆరోపణలపై భారత వాయుసేన మాజీ అధికారి మహమ్మద్ గువాస్ ఖాన్ ను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అజర్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌధురి వెల్లడించారు. భోపాల్ - ఉజ్జయిన పాసింజర్ రైల్లో ఉగ్రవాదులు పేలుడు జరిపిన తరువాత, యూపీ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ రంగంలోకి దిగి, లక్నోలో ఉగ్రవాది సైఫుల్లాను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అతని వద్ద దొరికిన ఆధారాలతోనే వీరిని గుర్తించినట్టు తెలుస్తోంది. సైఫుల్లా వెనకుండి నడిపించిన వ్యక్తి కూడా గువాసేనని పోలీసులు వెల్లడించారు. కాన్పూర్ లో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణలో నిజాన్ని కక్కించారని, సాంకేతిక నిపుణుడైన గువాస్, మొత్తం ఐఎస్ఐఎస్ మాడ్యూల్ లో అత్యంత కీలక సభ్యుడని దల్జిత్ సింగ్ తెలిపారు. మరో వ్యక్తి అజర్, వీరికి ఆయుధాలను, పేలుడు పదార్థాలనూ సరఫరా చేశాడని వెల్లడించారు.