: పెళ్లి ఇష్టం లేక విషం తీసుకున్న అక్క.. వరుడితో మూడుముళ్లు వేయించుకున్న చెల్లెలు


యథార్థ ఘటనల ఆధారంగా సినిమాలు తీస్తారో.. లేక సినిమాల్లో చూపినట్టు జరుగుతుందో చెప్పడం కొంచెం కష్టమే. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఇంచుమించు ఇటువంటి ఘటనే జరిగింది. పెళ్లి ఇష్టం లేని అక్క విషం తీసుకుని స్పృహ తప్పి పడిపోతే వరుడితో పెళ్లికి చెల్లెలు సిద్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం.. తురయూర్ సమీపంలోని బట్టంపట్టికి చెందిన బాలకుమార్(27), సేలం జిల్లా సెందారపట్టికి చెందిన శరణ్య(20)కు వివాహం నిశ్చయమైంది. బుధవారం తురయూరులోని ఓ ఆలయంలో వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు.

మంగళవారం రాత్రి రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం పెళ్లి మండపానికి అందరూ చేరుకున్నారు. పెళ్లి కుమారుడు పీటలపై కూర్చున్నాడు. వధువును పెళ్లి పీటలపైకి తీసుకొచ్చేందుకు వెళ్లారు. అంతే, అక్కడి సీన్ చూసి అందరూ షాక్ తిన్నారు. పెళ్లి ఇష్టం లేని వధువు విషం తీసుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పై చదువులు చదవాలని ఉందని ఆమె తెలిపింది. ఈ ఘటనపై వరుడి తరపు బంధువులు తురయూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబాల వారితో చర్చించారు. చివరికి పెళ్లి కుమార్తె చెల్లెలు సంగీత(18)ని బాలకుమార్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. సంగీత కూడా అందుకు ఒప్పుకోవడంతో పెళ్లి వైభవంగా జరిగింది.  

  • Loading...

More Telugu News