: ఆ సంస్కారాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి మాకు నేర్పారు: వైఎస్సార్సీపీ నేత బుగ్గన
రైతులు పెట్టిన భోజనం తినలేదని తమ పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తినే ప్రతి ముద్దను రైతును తలచుకుని తినే సంస్కారాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు నేర్పారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని, స్థానికుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుడు తడకలేనని, వాస్తవాలను చెబుతుంటే సీఎం చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, అందుకే, ప్రతిపక్షంపై ఆయన ఎదురు దాడి చేస్తున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై కూడా ఆయన మండిపడ్డారు. ఇటువంటి ఆర్థిక మంత్రిని ఎక్కడా చూడలేదని, ఆయన చెప్పిన లెక్కలకు, వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు.