: యాంకర్ రవి, శ్రీముఖిలను నర్సులు చెప్పులతో కొడతారు: నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్
బుల్లి తెర యాంకర్లు రవి, శ్రీముఖిలు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఛానల్ లో ప్రసారమవుతున్న ఓ కార్యక్రమంలో వారు నర్సులను కించపరిచేలా వ్యాఖ్యానించారు. దీంతో, వారిపై నర్సులు మండిపడుతున్నారు. అంతేకాదు, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో వీరిపై నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి సుష్మిత మాట్లాడుతూ రవి, శ్రీముఖిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వీరిద్దరూ ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లలేదా? అని ఆమె ప్రశ్నించింది. వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో నర్సులతో చికిత్స చేయించుకోలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రవి, శ్రీముఖిలు బయటకొస్తే ప్రతి ఒక్క నర్సు చెప్పు తీసుకొని కొడుతుందని హెచ్చరించింది. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి, తాము ఎంతో సేవ చేస్తామని... అలాంటి తమను అవహేళన చేసిన వారిని చెప్పులతోనే కొడతామని తెలిపింది. రవి, శ్రీముఖిలు తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.