: అతి త్వరలో వరకట్నం స్థానంలో కన్యాశుల్కం: చంద్రబాబు నోట ఆసక్తికర మాట
అతి త్వరలో ప్రస్తుతమున్న వరకట్నం స్థానంలో కన్యాశుల్కం వస్తుందని, అది ఈ తరం ప్రజలే చూస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, సాధికారత సాధిస్తున్న మహిళలకు మరింత చేయూత నిచ్చేందుకు తాను ఎన్నడూ ముందు నిలుస్తానని తెలిపారు. మరికొన్ని సంవత్సరాల్లో ఎదురు కట్నం ఇచ్చుకోవాల్సిన రోజులు వస్తాయని అంచనా వేశారు.
మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తే, ఏదైనా సాధిస్తారని ఎన్నో రంగాల్లో ఇప్పటికే నిరూపితమైందని, మహిళా వర్శిటీని, మహిళలకు ఆస్తి హక్కును ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని గుర్తు చేసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల్లో, చదువులో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చానని అన్నారు. కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవాన్ని తెచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటున్నట్టు వెల్లడించారు.
మహిళాభివృద్ధితోనే పేదరికం నిర్మూలించబడుతుందని వ్యాఖ్యానించిన చంద్రబాబు, వారు ధైర్యంగా ఉంటే వాళ్ల జోలికి ఎవరూ వెళ్లరని అన్నారు. మహిళా సాధికార సదస్సులో తీసుకున్న అన్ని అంశాలనూ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుతేజం పీవీ సింధుకు త్వరలోనే డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఇస్తామని, ఆమెను ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ ను చేస్తామని అన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు దక్కేంతవరకూ తాను పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.