: రైలు పేలుడు ఉగ్రవాదులకు ప్రాక్టీసు మాత్రమే... ఏ క్షణమైనా భారీ దాడి!


రైలు బోగీలో పేలుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కేవలం ప్రాక్టీసుగా జరిపిన చర్యేనని, ఏ క్షణమైనా భారీ దాడి చేసేందుకు ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని, ఈ కేసును విచారిస్తున్న ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సమస్య సున్నితత్వం కారణంగా పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆయన, లక్నో సమీపంలోని ఠాకూర్ గంజ్ లో సైఫుల్లా ఎన్ కౌంటర్, ఆపై ఐదుగురిని అరెస్ట్ చేసిన తరువాత సదరు అధికారి ఎన్డీటీవీతో మాట్లాడారు.

యూపీలోని బారాబంకీ ప్రాంతంలో ఓ సూఫీ మసీదుపై పెను దాడి చేయడం వీరి లక్ష్యమని, దీంతో పాటు భారీ ఎత్తున దాడులకు ప్లాన్ చేశారని వివరించారు. అరెస్టయిన వారంతా 20 ఏళ్లలోపు యువకులే కావడంతో, వీరి వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉండి ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న దాదాపు 12 గంటల పాటు ఎన్ కౌంటర్ జరిపిన పోలీసులు, ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాలుగా ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. పోలీసు కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది వద్ద ఐఎస్ఐఎస్ జెండా, రైళ్ల సమయాల వివరాలు లభించాయి.

  • Loading...

More Telugu News