: ఉగ్రవాదులు వాడినవి పైప్ బాంబులు.. వాటి ఫొటోలు సిరియాకు కూడా వెళ్లాయి
భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడుకు ఉగ్రవాదులు వాడినవి పైపు బాంబులని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రైల్లో పెట్టిన పైపు బాంబులను వాళ్లు ఫొటో తీసి, సిరియాకు కూడా పంపారని చెప్పారు. అయితే, రైల్లో ఈ బాంబులను ఉగ్రవాదులు పైబెర్తులో ఉంచారని... దాంతో, రైలు పైకప్పు మాత్రం ధ్వంసమయిందని... ఈ బాంబులను బెర్తు కింద పెట్టి ఉంటే, భారీగా జన నష్టం సంభవించి ఉండేదని అన్నారు. ఈ ఉగ్రవాదులు కాన్పూర్, కనౌజ్ ల నుంచి వచ్చారని... బాంబులు పెట్టిన వెంటనే లక్నో వెళ్లిపోదామని వారు ప్లాన్ చేసుకున్నారని చౌహాన్ చెప్పారు. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో వాళ్లు లక్నో నుంచి మధ్యప్రదేశ్ కు వచ్చారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల మీద 'ఐసిస్, మేము ఇండియాలో ఉన్నాం' అని రాసి ఉందని చెప్పారు. ఈ దాడికి పాల్పడినవారు ముమ్మాటికీ ఐసిస్ కు చెందిన వారే అని తెలిపారు.