: అమెరికాతో సమానంగా పాక్‌లో భారత వలసదారులు!
విదేశాల్లో ఉద్యోగం అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది అమెరికా పేరే. అయితే, భారతీయులు అత్యధికంగా యూఏఈలో నివసిస్తున్నారని ‘ప్యూ పరిశోధక కేంద్రం’ పేర్కొంది. అంతేగాక అమెరికాలో ఎంత మంది భారత వలసదారులు ఉన్నారో అదే సంఖ్యలో పాక్‌లోనూ ఉన్నారని తెలిపింది. యూఏఈలో మొత్తం 35 లక్షలమంది భారతీయులు ఉండగా, పాక్, అమెరికాల్లో 20 లక్షలమంది చొప్పున భారతీయ వలసదారులు ఉన్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో ప్రతి 20 మందిలో ఒకరు మనదేశంలో జన్మించినవారేనని పేర్కొంది.
భారత్‌లో జన్మించినవారిలో సుమారు ఒకశాతం మంది విదేశాల్లో నివసిస్తున్నారని చెప్పింది. కాగా, భారత్ కూడా భారీసంఖ్యలో వలసదారులకు ఆశ్రయమిస్తోందనీ, మనదేశంలో 32 లక్షలమంది బంగ్లాదేశ్ వాసులు, 11 లక్షలమంది పాకిస్థానీలు వున్నారని చెప్పింది. అలాగే 5.4 లక్షల మంది నేపాల్ వాసులు, 1.6 లక్షలమంది శ్రీలంక వాసులు వలసదారులుగా ఉన్నారని ‘ప్యూ పరిశోధక కేంద్రం’ నివేదికలో పేర్కొన్నారు.