: తమిళనాడులో మరోసారి అలజడి... పన్నీర్ సెల్వం దీక్ష ప్రారంభం
అమ్మ జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ రోజు దీక్ష ప్రారంభించారు. చెన్నైలోని రాజరాథినం స్టేడియంలో జరుగుతున్న ఈ దీక్షలో పన్నీర్ సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్నారు. దీక్ష ప్రాంగణానికి భారీ ఎత్తున పన్నీర్ సెల్వం మద్దతుదారులు, ప్రజలు చేరుకుంటున్నారు. జయలలిత మృతిపై పలువురు నేతలు ఇప్పటికే ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమెకు అందించిన చికిత్సపై గత నెల అపోలో యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. రెండు రోజుల క్రితమే తమిళనాడు సర్కార్ కూడా వివరణ ఇచ్చింది. అయితే, వారు ఇచ్చిన సమాధానాలు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జయలలిత మరణంపై సీబీఐతో విచారణ జరిపించడానికి ఆదేశాలు వచ్చే వరకు తాము దీక్షను విరమించబోమని పన్నీర్ సెల్వం చెబుతుండడంతో తమిళనాడులో మరోసారి అలజడి రేగుతోంది.