: లంచాల భారతం.. సర్వేలో మనకే అగ్రస్థానం!
మన దేశం లంచాలకు పెట్టింది పేరు అని, ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కెల్లా భారత్ అగ్ర స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం ఈ సర్వే నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని 16 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది గత ఏడాదిలో కనీసం ఒక్కసారైనా తాము లంచం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సర్వే ప్రకారం, భారత్ లో ప్రభుత్వ సేవలు పొందాలంటే తప్పనిసరిగా లంచాలు ఇవ్వాల్సి వస్తోందని మన దేశ ప్రజలలో 69 శాతం మంది ఈ సర్వేలో చెప్పారట.
ఈ సర్వేలో లంచాల్లో భారత్ తర్వాతి స్థానంలో వియత్నాం నిలిచింది. కార్యాలయాల్లో తమ పనులు జరగాలంటే లంచాలు ఇవ్వక తప్పడం లేదని 65 శాతం మంది ప్రజలు చెప్పినట్లు సర్వే సమాచారం. ఇక, మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది ప్రజలు లంచాలు ఇవ్వక తప్పడం లేదన్నారు. లంచాలు తీసుకోవడం అతి తక్కువగా ఉన్న దేశం జపాన్. అక్కడ లంచాలు ఇచ్చే వారి శాతం 0.2 కాగా, దక్షిణ కొరియాలో 3 శాతంగా ఉండటం గమనార్హం. కాగా, గత ఏడాదితో పోలిస్తే లంచాల శాతం భారత్ లో 41 శాతం, చైనాలో 73 శాతం పెరిగింది.